నాగవరం ఉన్నత పాఠశాలలో ‘ఆర్ట్ ఆఫ్ ఆన్సరింగ్’ పై మోటివేషన్ కార్యక్రమం
నాగవరం, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
నాగవరం ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ప్రేరేపించే లక్ష్యంతో “ఆర్ట్ ఆఫ్ ఆన్సరింగ్” అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.సి. రాములు జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు.ముఖ్య అతిథిగా హాజరైన భారత దేశ గ్రాఫాలజిస్ట్ డా. వై. మల్లికార్జున రావు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే చేతివ్రాతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.సమాధానాలను స్పష్టంగా, శుభ్రంగా రాయడం వల్ల మూల్యాంకనంలో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల సమయంలో సమయపాలన, సమాధానాల నిర్మాణం, ముఖ్యాంశాలను హైలైట్ చేయడం వంటి మెళకువలను పాటించాలని వివరించారు.తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి యూకే విశ్వవిద్యాలయంలో గ్రాఫాలజీ అభ్యసించి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానికి అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. కఠినమైన విషయాలను ముందుగా ఆసక్తితో చదవాలని, ఏ విషయాన్నైనా ఏకాగ్రతతో మూడు సార్లు చదివితే సులభంగా గుర్తుంచుకోవచ్చని చెప్పారు.గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా మాత్రమే విజయపథంలో ముందుకు సాగవచ్చని విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు. “మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది” అని సందేశం అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజ్యలక్ష్మి, అరవింద్ కుమార్, శ్రీదేవి, వరమ్మ, ఏ. సంధ్యారాణి, కమల, రమా సత్యశ్రీ, గాయత్రిసంజయ్ రాణి, సుప్రజ, స్వప్న, శ్రీవిద్య, అల్క, పావని, పవిత్రలు పాల్గొన్నారు.


Comments