శాస్త్రీయ విజ్ఞానం సమాజ అభివృద్ధికి బలమైన పునాది
మద్దిగట్ల–మోజర్ల పాఠశాలలో ఘనంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవం
-- పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాదరావు
పెద్దమందడి,ఫిబ్రవరి28(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల–మోజర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శాస్త్ర ప్రదర్శనలు, వినూత్న నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణం శాస్త్ర స్ఫూర్తితో కళకళలాడింది.ముందుగా భారత శాస్త్రవేత్త సి.వి. రామన్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాదరావు నివాళులర్పించి పూజా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మద్దిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్, మోజర్ల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ వైజ్ఞానిక మేళాను ప్రారంభించి, విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు.ప్రతి నమూనా వివరాలు తెలుసుకుని విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.విద్యార్థులు డైనమో ద్వారా ఏసీ–డీసీ కరెంటు వివరణ, మానవ అస్తిపంజరం, హృదయం–నాడీ వ్యవస్థ నిర్మాణం, జల విద్యుత్ ప్రాజెక్టులు, అగ్నిపర్వతం లావా విసర్జన విధానం, పర్యావరణ వ్యవస్థ, కిరణజన్య సంయోగ క్రియ, గ్లోబల్ వార్మింగ్ తదితర శాస్త్రీయ నమూనాలను ప్రదర్శించారు. మైక్రోస్కోప్ ద్వారా ఉల్లిగడ్డ అంతర్నిర్మాణం చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వరప్రసాదరావు మాట్లాడుతూ.. శాస్త్రీయ విజ్ఞానం సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. పరిశీలన, పరిశోధన, ప్రయోగాల ద్వారా నిజాన్ని తెలుసుకునే దృక్పథమే శాస్త్రీయ ఆలోచన అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథం పెంపొందితే భవిష్యత్తులో వారు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్ వరప్రసాద్ రావు, ఉపాధ్యాయులు డి రణదీవ్, పి వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, శ్రీమతి వాణి ప్రభ, మధుసూదన్ ఎన్ వెంకటస్వామి,ఏ వెంకటస్వామి, శ్రీనివాసులు, ఏ భగవంతు, చిన్నారెడ్డి, విద్యార్థులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


Comments