ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి..
* మిగిలిన ముప్పై ఎకరాల భూమి ఏమైంది?
* దానం చేసిన భూమిని లాక్కునే హక్కు ఎవరిచ్చారు?..
* కూల్చివేతలకే పరిమితమైన రేవంత్ రెడ్డి పాలన..
* బాధితులకు బాసటగా నిలిచిన భారతీయ జనతా పార్టీ
* నియంతల కంటే దారుణమైన అహంకారం.. పేదల ఉసురుతో ప్రభుత్వ పతనం ఖాయం.
* మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ ఆగ్రహం.
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 28(తెలంగాణ ముచ్చట్లు)
నిరుపేదలకు దానం చేసిన భూమిని దౌర్జన్యంగా లాక్కునే హక్కు కాంగ్రెస్ పాలకులకు ఎవరిచ్చారు?.. కనీస కనికరం లేకుండా నిద్రమత్తులో ఉన్న అభాగ్యుల ఆవాసాలను నేలమట్టం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. అరవై రెండు ఎకరాల భూదాన్ భూమిలో ముప్పై రెండు ఎకరాల్లో పేదలు తలదాచుకుంటుంటే అమానుషంగా లాక్కున్న అధికార పక్షం, మిగతా ముప్పై ఎకరాల భూమిని ఏ బడాబాబులకు కట్టబెట్టిందో, ఆ భూమి ఏమైందో తక్షణమే లెక్క చెప్పాలి" అంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
శనివారం ఆయన ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో తలదాచుకుంటున్న భూదాన్ బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. నిలువనీడ కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న బాధితులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈటల రాజేందర్ స్వయంగా అభాగ్యులకు భోజనం వడ్డించి వారి కన్నీళ్లు తుడిచారు. ఈ కష్టకాలంలో పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ నిరంతరం అండగా నిలుస్తుందని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో అమాయక ప్రజల కన్నీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లెదుటే గుడిసెలు కూలిపోయి బతుకులు రోడ్డున పడటంతో ఈ ప్రభుత్వం సర్వనాశనం కావాలని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాలను అధికార పక్షానికే కట్టబెట్టారని, కీలక మంత్రి పదవులు కూడా ఈ జిల్లాకే దక్కాయని గుర్తుచేశారు. పలువురు మంత్రులు ఉన్నా తమకు న్యాయం జరుగుతుందని జనం ఎంతో సంబురపడ్డారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే దారుణంగా తమ ఇళ్లనే కూల్చివేస్తారని నిరుపేదలు ఏనాడూ ఊహించలేదని విమర్శించారు. మొదట్నుంచీ కాంగ్రెస్ దమననీతినే కొనసాగిస్తోందని మండిపడ్డారు.
భూదాన్ భూమి అంటేనే నిరుపేదలకు దానం చేసిన భూమి అని పాలకులకు కనీస స్పృహ లేదా అని ఈటల రాజేందర్ నిలదీశారు. మహానుభావుడు వినోబా భావే వేలాది ఎకరాలను దానం చేశారని అందులో భాగంగానే సర్వే సంఖ్య నూట నలభై ఏడు, నూట నలభై ఎనిమిది, నూట నలభై తొమ్మిదిలలో అరవై రెండు ఎకరాల భూదాన్ భూమి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు ఈ భూములను ఎవరూ పట్టించుకోలేదని కానీ నేడు ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో బడాబాబుల కన్ను అటు వైపు పడిందని ఆరోపించారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన కేవలం కూల్చివేతలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. నిరుపేదలకు భూములు పంచడం చేతకాని ఈ ప్రభుత్వానికి ఉన్న భూములను కబ్జా చేయడం లాక్కోవడం మాత్రమే తెలుసునని తీవ్రంగా విమర్శించారు. రెండు వేల పంతొమ్మిదిలోనే న్యాయమూర్తి చల్లా కోదండరాం ఈ పేదలకు విద్యుత్తు నీళ్లు ఇవ్వాలని ఆదేశించినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈనాటి ప్రభుత్వం ఆ కనీస వసతులు కల్పించకపోగా దౌర్జన్యంగా ఉన్న ఇళ్లను కూడా లాక్కుందని మండిపడ్డారు.
ఏ న్యాయస్థానం ఇళ్లు కూల్చమని ఆదేశాలు ఇచ్చిందని రక్షక భటులతో వెళ్లి బలవంతంగా ఇళ్లు లాక్కున్నారని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పేదల గుడిసెలు కూల్చిన పాలకులకు కబ్జా చేసిన బడాబాబుల వద్ద ఉన్న వందలాది ఎకరాల భూములు వెనక్కి తీసుకునే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. పెద్దల జోలికి వెళ్లే ధైర్యం లేకనే ఏ దిక్కూ లేని అభాగ్యులపై ప్రతాపం చూపుతున్నారని దుయ్యబట్టారు. అరవై రెండు ఎకరాల భూమిలో ముప్పై రెండు ఎకరాల్లో పేదలు తలదాచుకుంటుంటే దాన్ని అమానుషంగా లాక్కున్నారని, మిగతా ముప్పై ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆ భూమి ఏమైందో చెప్పాలని నిలదీశారు. ఆ ముప్పై ఎకరాల భూమి లెక్క జిల్లా పాలనాధికారి చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేదల కళ్లలో మట్టి కొట్టిన అత్యంత దుర్మార్గపు ప్రభుత్వమని విమర్శించారు.
జిల్లాలో ఉన్న భూదాన్ భూముల వివరాలు మొత్తం వెంటనే బహిర్గతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహ జ్వాలల్లో ఈ ప్రభుత్వం మాడిమస్సైపోవడం ఖాయమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, గల్లా సత్యనారాయణ , నాయకులు శీలం పాపారావు, దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వీరవల్లి రాజేష్, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, కుమిలి శ్రీనివాస్, రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, ఏలూరి నాగేశ్వరరావు, కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి,మనీ , నకిరేకంటి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.


Comments