ఉపవాసాల ఉద్దేశ్యం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 27(తెలంగాణ ముచ్చట్లు)
ఇస్లాం ధర్మం యొక్కమూల స్తంభాలలో ఉపవాసం ఒకటి. ఇది దైవానికి తప్ప మరెవ్వరికి కానరాని ఆరాధన. ఉపవాసం యుక్త వయస్సు వచ్చిన ప్రతి స్త్రీ, పురుషునిపై ఫర్జ్ (విధి)గా నిర్ణయించబడిరది. షరియత్ పరిభాషలో ‘సౌమ్’ (ఉపవాసం) అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు తినడం, సంభోగించడం వంటి అవసరాలను మానుకోవడం. ఇంకొక అర్థం చేస్తున్న పని నుండి ఆగిపోవడం, దానిని విడనాడటం అని అర్థం.
అల్లాప్‌ా దివ్యఖుర్‌ఆన్‌లో ఈవిధంగా సెలవిస్తున్నాడు : ‘‘విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడిరది. ఈవిధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించబడిరదో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’ (బఖర : 183)
ఉపవాసం వలన దైవం పట్ల భయభక్తులు జనిస్తాయని దివ్యఖుర్‌ఆన్‌లో చెప్పబడిరది. అంటే మనం చేసే ప్రతి పనిని దైవం చూస్తున్నాడని తీర్పుదినాన అన్ని పనులను సమీక్షిస్తాడని, తప్పు చేస్తే శిక్షిస్తాడని భయపడుతూ, చెడుకు దూరంగా ఉంటూ మంచికి చేరువ కావాలి. దైవం పట్ల భయభక్తులు జనించడం ఉపవాసం యొక్క ఒక ఉద్దేశ్యం. అల్లాప్‌ా విశ్వాసుల జీవితాలకు, దశ, దిశ నిర్దేశించే దివ్యఖుర్‌ఆన్‌లాంటి మార్గదర్శనిని పంపినప్పుడు విశ్వాసి ఉపవాసాలు పాటించి ఆ విశ్వప్రభువుకు తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు.
అల్లాప్‌ా ప్రసన్నతను పొందే మార్గం మనకు దివ్యఖుర్‌ఆన్‌లో తెల్పబడిరది. దానిని మనం స్వయంగా ఆచరిస్తూ అమలుచేస్తూ ఇతర విశ్వాసులకు కూడా తెలియజేయడానికి దివ్యఖుర్‌ఆన్‌ను మనకు పంపబడిరది. ఈ లక్ష్యం కొరకు మనల్ని తయారు చేసే ఉత్తమ మార్గం ఉపవాసం. ఉపవాసం పాటించడం కేవలం ఆరాధన కాదు కేవలం నైతిక శిక్షణ కూడా కాదు. వాటికితోడు అల్లాప్‌ా దివ్యఖుర్‌ఆన్‌ను మనకు ఇచ్చినందుకు కృతజ్ఞత. రమజాన్ మాసంలో ఉపవాసి సృష్టికర్తతో ఎక్కువ సంబంధం కలిగివుంటాడు. ఏ పనులనైతే ఇస్లాం నిషేధించిందో వాటికి దూరంగా ఉంటాడు. సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
ప్రతి విశ్వాసి ఉషోదయానికి ముందే ఉపవాస దీక్షను ఆరంభిస్తాడు. సుమారు 14 గంటల కాలంలో ఏమి తినడు, కనీసం మంచి నీళ్ళు కూడా మట్టుకోడు. అతను తలచుకుంటే రహస్యంగావెళ్ళి తినవచ్చు. నీటిని త్రాగవచ్చును. కాని దైవభీతితో ఆ పని చెయ్యడు. ఎవ్వరూ చూసినాచూడకపోయినా, నా దైవం చూస్తున్నాడనే భయంతో ఆ పని చెయ్యడు. అచంచలమైన దైవభీతి అతనిలో ఉంటుంది. రమజాన్ నెలంతా అతనిలో దైవభీతి మెండుగా ఉంటుంది. రమజాన్ మాసం తర్వాత 11 నెలలలో కూడా అతను ఈ క్రమశిక్షణను అలవర్చుకోవాలి. అప్పుడే అతని ఉపవాసానికి, ఆరాధనకు సార్థకత ఏర్పడుతాయి. దైవభీతితో అబద్ధాలు చెప్పడు, వ్యభిచారానికి దూరంగా ఉంటాడు, ఇరుగుపొరుగు వారితో సఖ్యతగా ఉంటాడు. అవినీతి, లంచగొండితనానికి దూరంగా ఉంటాడు. తన కోరికలను అదుపులోఉంచుకుంటాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్ధునిగా చేయడమే ఉపవాసాల అసలు ఉద్దేశ్యం.రమజాన్ ఉపవాసాలు భయభక్తుల శిక్షణనిస్తాయి. మనిషి శీలసంపద పెంపుకు ఉపవాస దీక్ష ఒక ముఖ్య అవసరం. విశ్వాసికి ఆకలి అంటేఏమిటో ఈ ఉపవాసాల ద్వారా తెలుస్తుంది. పేదవాడి ఆకలిబాధ ఎలా ఉంటుందో అతనికి అర్థమవుతుంది. దీనివల్ల పేదలను ఆకలితో అలమటించేవారిని ఆదుకోవాలనే తపన అతనిలో మొదలవుతుంది.
అందుకే మహాప్రవక్త ముహమ్మద్ (స) రమజాన్ మాసాన్ని సానుభూతి మాసం అన్నారు. పేదల పట్ల ప్రేమ, సానుభూతిని చూపించమన్నారు.
ఉపవాసాల యొక్క ముఖ్యోద్దేశాలలో ‘సహనం వహించటం’ ఒకటి. రమజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం వలన విశ్వాసికి సహన గుణం అలవడుతుంది. అతను తన జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలను సహనంతో, ఓర్పుతో ఎదుర్కొంటాడు. రోజా ఉద్దేశ్యం సత్యం పలకటం, మంచి ఆచరణల గురించి శిక్షణనివ్వడమేనని హదీసుల ద్వారా తెలుస్తుంది. ఉపవాసం యొకక ఉద్దేశ్యాలలో ఒకటి ఏమిటంటే ఉపవాసం పాటించే వ్యక్తులలోచెడును అరికట్టి మంచిని పెంపొందింపజేయడం. అందుకే దైవప్రవక్త(స) ఉపవాసాన్ని ఢాలు వంటిదిఅన్నారు. ఏవిధంగా ఢాలు సైనికుణి శత్రుదాడి నుండి రక్షిస్తుందో అదేవిధంగా రోజా మనిషిని చెడునుంచి రక్షిస్తుంది. ఉపవాసం మనలో సమయపాలనను పెంపొందిస్తుంది.
ఉపవాసం ముఖ్య ఉద్దేశ్యాలలో దైవం యొక్క ఔన్నత్యాన్ని కొనియాడటం ఒకటి.
దైవం మనందరికి రమజాన్ ఉపవాసాలు పాటించే సద్భాగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక! (ఆమీన్)
అబ్దుల్ మలిక్ (ఖమ్మం)


Comments