గౌతమ్ మోడల్ స్కూల్లో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో
విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
కుషాయిగూడ, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏఎస్ రావు నగర్‌లోని గౌతమ్ మోడల్ స్కూల్ లో శనివారం వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఎక్స్‌పో)ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు.ఈ సైన్స్ ఎక్స్‌పోలో విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ మోడల్స్, ప్రాజెక్టులు మరియు ప్రయోగాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సौरశక్తి వినియోగం, నీటి సంరక్షణ, ఆధునిక సాంకేతికత వంటి అంశాలపై విద్యార్థులు సమగ్ర వివరణలతో ప్రదర్శనలు ఇచ్చారు. వారి ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.సిఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అభినందించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు.పాఠశాల ప్రిన్సిపల్ ఎం.వి. శేషుకుమారి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా విద్యతో పాటు సైన్స్, మ్యాథ్స్ ఎక్స్‌పోలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకన్న, వైస్ ప్రిన్సిపల్ గీత,
ప్రైమరీ ఇన్‌చార్జ్ శ్రీలత, ఉపాధ్యాయులు రాధిక, రాజేందర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Comments