తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు
_లక్షలాది భక్తులతో ఆలయం కిటకిట
_రెండు లక్షల మందికి ఉచిత అన్నప్రసాద వితరణ
హైదరాబాద్, మార్చి 9 (తెలంగాణ ముచ్చట్లు):
తిరునల్లార్లోని ప్రసిద్ధ ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయంలో శని పేర్చి పవిత్ర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుంభ రాశి నుంచి మీన రాశికి శని గ్రహం మారిన సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుంచి 45 రోజులపాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు.ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మార్చి 6, 7, 8 తేదీలలో సుమారు ఆరు లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించి శని భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ శని పేర్చి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు.ఆలయ 27వ పీఠాధిపతి శ్రీ లా శ్రీ కైలై మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామిగళ్ ఆశీర్వాదాలతో కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్ మరియు సోలిస్ ఐ హాస్పిటల్ చైర్మన్ నందనపాటి రాము ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఐదోసారి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే ఆలయంలో హోమాలు, శని భగవానుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా నందనపాటి రాము కుటుంబ సభ్యులు, సోలిస్ హాస్పిటల్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శివ శ్రీ టి. రాజస్వామి నాథశివాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అరికపూడి గాంధీ, భీరం హరివర్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, లక్ష్మీ సౌజన్య, ఇషితా రాఠి, కొత్త రామారావు తదితరులు పాల్గొన్నారు.


Comments