కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు
వనపర్తిఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి,మార్చి9(తెలంగా ముచ్చట్లు):
కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన గుర్తింపు మరియు బాధ్యతలు కల్పిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.శ్రీరంగాపురం మండల కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీ తరఫున నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధ్యక్షులను నియమిస్తున్నామని చెప్పారు. బూత్ స్థాయి అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, వారు గ్రామ సర్పంచ్ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.ప్రతి కమిటీలో 21 మంది సభ్యులు ఉంటారని, ఆ విధంగానే మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసే వారిని దూరంగా ఉంచడం మంచిదని సూచించారు.ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా స్థానిక నాయకులు తప్పనిసరిగా హాజరై ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.అందరూ ఒకటిగా ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని, ప్రతిపక్షాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే పార్టీ తరఫున ఎన్నికయ్యే వారు జూమ్ కాల్, వాట్సాప్ వంటి డిజిటల్ వేదికలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మండల కమిటీకి సంబంధించిన ఆశావాహుల పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.మండల కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మద్దిలేటి, జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, మండల అధ్యక్షుడు రాములు యాదవ్, పీసీసీ జనరల్ సెక్రటరీ నందిమల్ల యాదయ్య, ఓబీసీ జనరల్ సెక్రటరీ కోట్ల రవి, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదుని రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, నాయకులు శ్రీహరి రాజు, బీరం రాజశేఖర్ రెడ్డి, న్యాయవాది తిరుపతయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.


Comments