1962 పశు సంచార వాహన సిబ్బందికి అభినందనలు.!
డిస్టోషియా సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గొర్రెకు సకాలంలో వైద్యం.
సత్తుపల్లి, జనవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):
కల్లూరు మండలం పడమటి లోకారం గ్రామంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గొర్రెకు సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన 1962 పశు సంచార వాహన సిబ్బంది సకాలంలో వైద్యం అందించి ప్రాణం కాపాడారు. పడమటి లోకారం గ్రామానికి చెందిన రైతు పర్వత వీరభద్రరావుకు చెందిన గొర్రెకు డిస్టోషియా (కడుపులో శిశువు మృతి చెంది ఉబ్బిపోవడం) సమస్య తలెత్తింది. రెండు రోజుల క్రితం గొర్రె బురదలో కూరుకుపోవడంతో కడుపులోని శిశువు చనిపోయి, గొర్రె నడవలేని స్థితికి చేరుకుంది.
ఈ విషయమై సమాచారం అందుకున్న సత్తుపల్లి పశు సంచార (1962) వాహన సిబ్బంది పేరా వెట్ మల్లెల్ల జగదీష్, కెప్టెన్ (డ్రైవర్) మహాకవి, వైద్య సహాయకుడు షేక్ సుభాని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికక్కడే అత్యవసర వైద్యం అందించి, కడుపులో మృతి చెందిన శిశువును సురక్షితంగా బయటకు తీసి గొర్రె ప్రాణాన్ని కాపాడారు.
సకాలంలో స్పందించి మూగజీవ ప్రాణం కాపాడిన పశు సంచార వాహన సిబ్బందిని పడమటి లోకారం గ్రామస్తులు, రైతు పర్వత వీరభద్రరావు అభినందించారు. అలాగే ఖమ్మం జిల్లా పశు సంచార (1962) వాహనాల మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మూడు జిల్లాల పశుసంచార (1962) వాహనాల ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్ కూడా సిబ్బందిని అభినందించారు.


Comments