హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌పై రాజకీయ తుపాన్ .
సీఎం దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకోలు… ఆందోళనలు ఉద్ధృతం
హుజురాబాద్, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణ శివారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటు వివాదం రోజురోజుకు రాజకీయ వేడిని పెంచుతోంది. డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.
బీజేపీ నాయకులు గంట సంపత్ ఆధ్వర్యంలో బోర్నపల్లి 14, 24వ వార్డులకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ కార్యక్రమంలో కందుగుల గ్రామ సర్పంచ్ ముప్పు మహేష్ పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గంట సంపత్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే డంపింగ్ యార్డ్‌ను హుజురాబాద్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఆందోళనలో కుర్ర సంపత్, గంట కుమార్, గంట శ్రీనాథ్, సమ్మట సాయిరాం, మంచి కట్ల ప్రసాద్, ముక్క మధు, చింతల శ్రీకాంత్, ఆకోజు మధు, పరికల రాములు, జంగవంశీ రాము, ఇరుమళ్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ఇప్పల్ నర్సింగాపూర్‌లో హనుమాన్ ఆలయం సమీపంలో కూడా బీజేపీ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. డంపింగ్ యార్డ్ రద్దు ప్రకటన వచ్చే వరకు రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష 38వ రోజుకు చేరుకోవడం గమనార్హం. ఈ దీక్షకు సంఘీభావంగా కొత్తపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని “డంపింగ్ యార్డ్ వద్దు – హుజురాబాద్ ముద్దు” అంటూ నినాదాలు చేశారు. ప్రజల మద్దతుతో ఈ ఉద్యమం మరింత విస్తరింప చేస్తామని చెప్పారు.


Comments