విద్యుత్ ఉపకేంద్రాల్లో తనిఖీ చేసిన ఏడీఈ రణధీర్ రెడ్డి
జాఫర్గడ్, తెలంగాణ ముచ్చట్లు: జాఫర్గడ్ మండల పరిధిలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల్లో ఆపరేషన్ ఘనపూర్ టీఎస్‌ఎన్‌పిడీసీఎల్ ఏడీఈ పాల్వాయి రణధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జాఫర్గడ్, ఓబులాపూర్, కూనూర్, ఉప్పుగల్ సబ్‌స్టేషన్లలో జరిపిన తనిఖీల్లో విధుల్లో ఉన్న సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సబ్‌స్టేషన్ల సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గంటకు లాగ్ బుక్‌లో రీడింగ్ నమోదు చేయాలని సూచించారు. సబ్‌స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతిరోజూ రెండు సబ్‌స్టేషన్లను తనిఖీ చేస్తున్నామని, విధుల్లో నిర్లక్ష్యం కనిపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
లైన్ క్లియర్ ఇచ్చినపుడు లేదా తీసుకున్నపుడు ఎర్త్ కర్రలు తప్పనిసరిగా వాడాలని సూచించారు. నెలాఖరు దగ్గరపడుతున్న తరుణంలో విద్యుత్ బకాయిల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. వినియోగదారులు బిల్లులు సకాలంలో చెల్లించి బకాయిలు లేకుండా చూసుకోవాలన్నారు.
వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో వినియోగదారులు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తడి చేతులతో స్టార్టర్ డబ్బాలు తాకకూడదని, ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజులను స్వయంగా మార్చకూడదని, ఇళ్లపై రేకులు లేదా ఇనుపచువ్వలకు సపోర్టు వైర్లు కట్టకూడదని హెచ్చరించారు. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ స్థంభాలు ముట్టకూడదని, సరఫరాలో అంతరాయం వచ్చినపుడు వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు మురళి, శరత్, రాజు, రాంరెడ్డి, అన్‌మ్యాన్డ్ వర్కర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Comments