సీపీఐ 4వ రాష్ట్ర మహాసభల ను విజయవంతం చేద్దాం
సీపీఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గోడ పత్రికను విడుదల
వి ఎస్. బోస్, సీపీఐ
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
సమసమాజమే లక్ష్యంగా ఆవిర్భవించి అనేక త్యాగాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 19 నుంచి 22 తేదీ వరకు నాలుగు రోజులు పాటు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఘనంగా జరగనున్నాయని,మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను సీపీఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ మాట్లాడుతూ వందేళ్ల ప్రస్థానంతో ముందుకు సాగుతున్న సిపిఐని ప్రజలతో మరింత మమేకం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర మహాసభలు కొనసాగుతాయని ఆయన అన్నారు. గడిచిన ఈ మూడేళ్లలో బిజెపి అనుసరిస్తున్న మతోన్మాద, ఫాసిస్టు విధానాలను వెలుగు లోకి తీసుకురావడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు.
తద్వారా గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని 240 సీట్లకు కట్టడి చేయడంలో విజయం సాధించామని చెప్పారు.
అసంఘంటిత కార్మికుల వేతనాల పెంపు కోసం సిపిఐ రాజీలేని పోరాటాలను నిర్వహిస్తోందన్నారు. అయితే అధికార పార్టీతో ఉన్న స్నేహా ధర్మాన్ని పాటిస్తునే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తున్నామని చెప్పారు. ఇకముందు మరింత పెద్దఎత్తున ప్రజా పోరాటాలకు సన్నద్దం కానున్నామని, ఇందుకు మహాసభల వేదికగా కార్యచరణను రూపొందించు కోనున్నామని తెలిపారు.
అదే విధంగా స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిసి బిల్లుకు బిజెపి పెద్ద అడ్డంకి అని విమర్శించారు. ఒక వైపు బిసి బిల్లుకు అడ్డుపడుతున్న బిజెపి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంపిన బిసి బిల్లులను గత 4 నెలలుగా తొక్కి పెట్టడం సరికాదని, ఆర్డినెన్స్ ఆమోదం విషయంలో సైతం ఇదే విధంగా చేయడం సమాజసం కాదన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు జీ.దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర,సీపీఐ ఉప్పల్ మండల జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్, సీపీఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు నారా నర్సింహా, లక్ష్మీ నారాయణ,బాబూరావు,
సాంబశివరావు, మిరియాల సాయిలు,,జాన్, శ్రీనివాస్, ఎల్లయ్య,నర్సింగరావు,నాగేష్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments