వితంతువులపై వివక్షకు స్వస్తి పలకాలి.. సమాజంలో గౌరవంగా జీవించేలా చేయాలి.
హుజూరాబాద్, జూన్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
హుజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో బాల వికాస్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని నిర్వహించారు. విధివంచనతో భర్తను కోల్పోయిన మహిళలను సమాజంలో చిన్నచూపు చూడకుండా, వారి గౌరవాన్ని కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
మూఢనమ్మకాలను రూపుమాపి, వితంతువులపై ఉన్న అపోహలను తొలగించేందుకు మహిళలే ముందుండి కృషి చేయాలని సూచించారు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులుగా కాకుండా, వితంతువులను కుటుంబం, సమాజంలో సమానంగా ఆదరించాలని అన్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లు, బతుకమ్మ వంటి వేడుకల్లో వారికి కూడా సముచిత స్థానం కల్పించి, మనోధైర్యంతో, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై కూడా అవగాహన కల్పించారు. చెట్లు తగ్గిపోవడం వల్లే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని గ్రామ సర్పంచ్ పోల్సాని రామారావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోల్సాని రామారావు, హుజూరాబాద్ సింగిల్ విండో బ్యాంక్ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజేశ్వర్ రావు, కార్యదర్శి సంపత్, సభ్యులు బిక్షపతి, తునికి లక్ష్మి, మీరపల్లి వెంకట్రావు, విజయ్ కుమార్, నజీమా, హుజూరాబాద్ ఏరియా కోఆర్డినేటర్లు ఎండి ఖాజాబీ, రజిత, కళ్యాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.


Comments