ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్‌ను కలిసిన టిఐసీసీఐ రాష్ట్ర నాయకులు.
హైదరాబాద్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):
ట్రైబల్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టిఐసీసీఐ ) తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనరేట్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన పారిశ్రామికవేత్తల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా గిరిజన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపన కోసం భూముల కేటాయింపు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల సమర్థ అమలు, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, పారిశ్రామిక రంగంలో గిరిజన యువత భాగస్వామ్యాన్ని పెంచే చర్యలపై ప్రతిపాదనలు సమర్పించారు.
ఈ సందర్భంగా టిక్కీ తెలంగాణ చాప్టర్ రాష్ట్ర అధ్యక్షుడు ధరవాత్ శ్రీనివాస్ మాట్లాడుతూ, గిరిజన యువతలో పారిశ్రామిక రంగంపై అవగాహన పెంపొందించడంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరమన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు భూ సేకరణలో ప్రభుత్వం సహకరించాలని కోరారు.
గిరిజన సమాజ ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం మరియు గిరిజన పారిశ్రామికవేత్తల మధ్య వారధిగా టిక్కీ తెలంగాణ చాప్టర్ పనిచేస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో టిక్కీ తెలంగాణ చాప్టర్ రాష్ట్ర కోఆర్డినేటర్ సంతోష్ నాయక్, ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి అశోక్ నాయక్‌తో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.


Comments