రైతు మేళా, ముఖ్యమంత్రి సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి...
జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్.
ఖమ్మం బ్యూరో , జూన్ -22(తెలంగాణ ముచ్చట్లు )
జూన్ 28, 29 తేదీలలో నిర్వహించే రైతు మేళా, జూన్ 30న మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొనే సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.
పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌తో కలిసి కలెక్టర్, చింతకాని మండలంలోని సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం భారీ స్థాయిలో సిబ్బందిని వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్, చింతకాని తహసీల్దార్‌లు సభా స్థలాన్ని పూర్తిస్థాయిలో క్లియర్ చేసి సిద్ధం చేయాలని ఆదేశించారు. సభ నిర్వహణ కోసం మొత్తం 25 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేయాలని, అందులో 20 ఎకరాలను బహిరంగ సభకు, 5 ఎకరాలను ప్రదర్శన స్టాల్స్ కోసం కేటాయించాలని సూచించారు. అదనంగా వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
జూన్ 28, 29 తేదీలలో రైతు మేళా, జూన్ 30న ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించనున్నందున అందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సుమారు 150 స్టాల్స్ ఏర్పాటు చేయాలని, రైతులతో చర్చించి వాటి స్థలాన్ని ఖరారు చేయాలని తెలిపారు. వేదికను ఏర్పాటు చేసి సమావేశ లేఅవుట్ రూపొందించాలని ఆదేశించారు.
సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక రూట్ మ్యాప్‌లు సిద్ధం చేయాలని, రెండు ప్రాంతాలకు వేర్వేరుగా ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి కార్యక్రమం రోజు సరైన పార్కింగ్, కార్యక్రమ అనంతరం సక్రమంగా తిరిగి పంపించడం వరకు లైజన్ అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు. మూడు రోజుల కార్యక్రమాలకు ఆహారం, త్రాగునీటి ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. స్టాల్ సిబ్బంది, శిక్షణ సిబ్బంది, విధుల్లో ఉండే ఉద్యోగులకు ప్రత్యేక ఆహార కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమం రోజున బస్సుల సమయాలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమం ప్రారంభం, ముగింపు సమయంలో నాణ్యమైన ప్యాకెట్ భోజనం అందించాలని తెలిపారు.
ఆర్ అండ్ బి శాఖ భూమి లెవెలింగ్, అవసరమైన బ్యారికేడింగ్ పనులు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో సమన్వయం చేసుకొని ఈవెంట్ మేనేజ్‌మెంట్ బృందాన్ని ఖరారు చేయాలని, ఎల్‌ఈడీ స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్‌లు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, సభా ప్రాంగణంలో ప్రతి 250 మందికి ఒక బాధ్యుడిని నియమించి నీటి పంపిణీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. స్టాల్స్, ప్రదర్శన ప్రాంతాల వద్ద కూడా త్రాగునీటి సదుపాయాలు కల్పించాలని తెలిపారు.
ప్రతి వ్యయాన్ని నిబంధనల ప్రకారం నిర్వహించాలని, అన్ని ఖర్చులు ఆడిట్‌కు లోబడి ఉంటాయని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రైవేట్ స్థలాలను పూర్తిగా శుభ్రపరిచి యథాతథ స్థితిలో తిరిగి అప్పగించాలని ఆదేశించారు. వేదిక నిర్వహణకు ఆర్డీవోను ఇన్‌చార్జిగా నియమించి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. వ్యవసాయ శాఖ ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రాలు పంపించాలని, డీఆర్ఓ జిల్లా స్థాయి ప్రోటోకాల్ ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
అగ్నిమాపక శాఖ అన్ని భద్రతా అంశాలను పరిశీలించాలని, సమాచార పౌర సంబంధాల శాఖ ఆడియో, వీడియో ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని సూచించారు. వేదికపై అతిథులకు అల్పాహారం, భోజన ఏర్పాట్ల కోసం ప్రత్యేక ప్రోటోకాల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.అవసరమైన డ్యూటీ పాసులు, వాహన పాసులు సిద్ధం చేసి, ఏ పాస్‌కు ఎక్కడి వరకు ప్రవేశం ఉంటుందో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు. అవసరానికి 10 శాతం అదనపు పాసులు ముద్రించి సిద్ధంగా ఉంచాలని, కార్యక్రమానికి 48 గంటల ముందు తుది జాబితాను ఖరారు చేసి పోలీసు శాఖకు అందించాలని సూచించారు.
విద్యుత్ శాఖ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, అవసరమైన బ్యాకప్ ఏర్పాట్లు కల్పించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందిని పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమానికి వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు.
నగర పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ గుర్తించిన స్థలాన్ని పూర్తి స్థాయిలో లెవెలింగ్ చేయాలని, పార్కింగ్ ప్రాంతాలకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పకడ్బందీగా రూపొందించాలని సూచించారు.
ముఖ్యమంత్రి హెలికాప్టర్‌తో పాటు మంత్రులు కూడా హెలికాప్టర్ల ద్వారా వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు వేర్వేరు హెలిప్యాడ్ ప్రదేశాలను గుర్తించాలని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సభా ప్రాంగణానికి వెళ్లే అన్ని రహదారులను పరిశీలించి అవసరమైన మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన చోట్ల విద్యుత్ స్తంభాల తొలగింపు, చెట్ల తొలగింపు పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. వేదిక సిబ్బంది, బ్యాక్ స్టేజ్ సిబ్బంది విధుల జాబితాలను ప్రత్యేకంగా సిద్ధం చేసి ముందుగానే పోలీసు శాఖకు అందించాలని కమీషనర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ,పి. శ్రీనివాస రెడ్డి, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments