దేశంలో పీఎం - జన్ మన్ పురోగతి ఎలా ఉంది..?
రాష్ట్రాల వారీగా ఇప్పటివరకు కేటాయించిన నిధులు, చేపట్టిన, పూర్తయిన ప్రాజెక్టుల వివరాలేంటి..?
* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయమహా అభియాన్ (పీఎం - జన్ మన్) పథకం ద్వారా దేశంలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించారని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం లోక్ సభలో ప్రశ్నించారు. దుర్బల గిరిజన సమూహా( పీవీటీజీ)ల పురోగతి వివరాలను కోరారు. దీనికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* వెనుకబడిన గిరిజన నివాస ప్రాంతాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం, వైద్య శిబిరాలు, అంగన్ వాడీ కేంద్రాలు, మొబైల్ టవర్ల ఏర్పాటు, సంక్షేమ వసతి గృహాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.
* గ్రామీణ అభివృద్ధి శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జలశక్తి, మహిళా మరియు శిశు సంక్షేమ, గిరిజన వ్యవహారాల శాఖల ద్వారా 2023 - 2026 ఆర్థిక సంవత్సరాల లక్ష్యాలను కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. 4.90 లక్షల ఇళ్లు, ఆదివాసి ప్రాంతాల్లో 8,000 కిలోమీటర్ల మేరకు రోడ్ల నిర్మాణాలు, 19,375 గ్రామాల్లో పైపులైన్ల ద్వారా సురక్షిత తాగునీటి సరఫరా, 2,500 గ్రామాల్లో అంగన్వాడి సెంటర్ల నిర్మాణాలు చేపట్టలనేది ప్రణాళికగా ఉన్నట్లు తెలిపారు.
* దేశవ్యాప్తంగా ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో ఈ పథకానికి రూ. 24 వేల కోట్లు కేటాయించగా.. ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రాల వారీగా వివిధ ప్రాజెక్టులు చేపట్టి.. నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.
* తెలంగాణలో 3,884 పురోగతి పనులు చేపట్టామని, 41 శివారు గుడేల్లో ఆదివాసీలకు మేలు జరగనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.47.49 కోట్లను కేటాయించామని, తెలంగాణ రాష్ట్రంలో రూ. 16.16 కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధినే ప్రధానమంత్రి జన్ - మన్ పథకం లక్ష్యమని కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి ఈ సందర్భంగా వివరించారు.
Comments