బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తానన్నది కేటీఆరే
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన ఆరోపణ
హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. కవిత జైలులో ఉన్న సమయంలో కేటీఆర్ తన ఇంటికి వచ్చి, ఈడీ, సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు సహాయం కోరినట్లు ఆయన ఆరోపించారు. అప్పట్లో కేటీఆర్ తానే స్వయంగా బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని చెప్పారని తెలిపారు.
“బీజేపీలోకి విలీనం చేస్తాను, పొత్తుకు సిద్ధం” అని కేటీఆర్ చెప్పినట్లు రమేష్ వెల్లడించారు. ఈ విషయాన్ని ధృవీకరించే సీసీటీవీ ఫుటేజీ కూడా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. “ఈ ఆరోపణలపై కేటీఆర్ బహిరంగంగా స్పందించాలి. నిజమైతే అంగీకరించాలి, కాదనుకుంటే తాను అప్పుడు ఎందుకు వచ్చారో చెప్పాలి,” అని రమేష్ డిమాండ్ చేశారు.
ఇక ఇటీవల కేటీఆర్ తీరుపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ,టీడీపీ పొత్తు గురించి వస్తున్న సంకేతాలతో బీఆర్‌ఎస్ భయపడుతోందని, అందుకే కేటీఆర్ అడ్డగోలు ఆరోపణలకు దిగుతున్నారని ఆరోపించారు. “తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లోన్లకు నాతో సంబంధమేంటి? నన్నెందుకు లాగుతున్నారు?” అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.
Comments