ఉనికిచెర్ల ఎస్ఆర్సిఎస్ లో మాదకద్రవ్య నిరోధక అవగాహన సదస్సు
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:
ఉనికిచెర్లలోని శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్లో మాదకద్రవ్య రహిత సమాజ ఏర్పాటు లక్ష్యంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రహరీ క్లబ్ ఆధ్వర్యంలో, మండల విద్యాధికారి డాక్టర్ రామ్ ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రతినిధులు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు.
ప్రధాన వక్తగా హాజరైన మండల అభివృద్ధి అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితమే కాక కుటుంబాలు, సమాజాన్ని కూడా తారుమారు చేస్తుందన్నారు. యువత, విద్యార్థులు ఈ సమస్య పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దిలీప్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల ప్రభావంతో శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వంతోపాటు ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, స్నేహితుల ఒత్తిడి వల్ల విద్యార్థులు, యువత గంజాయి, ఆల్కహాల్, హెరాయిన్, కోకైన్ వంటివి వాడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పదార్థాల వల్ల కలిగే నష్టాలను తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments