సంక్షోభంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
ప్రజా ఉద్యమాలే ప్రత్యామ్నాయం
-సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్
కాప్రా,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ఉద్యమాలే మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం మేడ్చల్ జిల్లా కమలానగర్‌లో జరిగిన సిపిఎం శాఖా కార్యదర్శుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సమావేశం ప్రారంభంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్‌కు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పాలడుగు భాస్కర్ “నయా ఉదారవాద విధానాలు, పెట్టుబడిదారుల అనుకూల ఆర్థిక విధానాలే ఈ సంక్షోభానికి కారణం. అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాలు తగిన పాఠాలుగా నిలుస్తున్నాయి. భారత్ కూడా అదే దిశగా వెళ్తోంది,” అని హెచ్చరించారు.
మోడీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన ఆయన “కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవస్థను తాకట్టు పెడుతున్నారు. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతోంది. ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. రైతులకు పాలు, సోయాబీన్ దిగుమతుల వల్ల ధరలు పడిపోతున్నాయి. దేశ ప్రజలకు మేలు కలగని ఒప్పందాలు అమెరికాతో కుదురుస్తున్నారు,” అని వ్యాఖ్యానించారు.
మతతత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ “పాల్గాం ఘటనపై ట్రంప్ వ్యాఖ్యలకు మోడీ మౌనంగా ఉండటం అనుమానాస్పదం. హిందుత్వ శక్తుల కుతంత్రాలకు ఇది సంకేతం,” అని అన్నారు. ప్రభుత్వ రంగాల విలీనాలు, సహజ వనరుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ “మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న చర్యలు, కార్పొరేట్ ప్రయోజనాలకోసమే” అన్నారు.
జిల్లా కార్యదర్శి పి. సత్యం మాట్లాడుతూ “మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగాలి. ప్రజా సమస్యలపై చొరవగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలి” అని అన్నారు. కార్యవర్గ సభ్యుడు కె. రవి “స్థానిక సమస్యలపై ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించాలి. యువతను ఆకర్షించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలి” అని తెలిపారు.ఈ సమావేశంలో ఐ. రాజశేఖర్, ఎ. అశోక్, ఎం. వినోద్ తదితర జిల్లా నాయకులు, కమిటీ సభ్యులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments