రైతాంగ సాయుధ పోరాట యోధుడు నరసింహారెడ్డి 34వ వర్ధంతి సభను జయప్రదం చేయండి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న
జనగామ, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యుడు ఏసి రెడ్డి నరసింహారెడ్డి 34వ వర్ధంతి సభ ఈ నెల 28న జనగామలోని సాయిరాం కన్వెన్షన్ హాల్లో జరగనుంది. ఈ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న ప్రజలకు, నాయకులకు పిలుపునిచ్చారు.
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో వర్ధంతి సభకు సంబంధించి సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భూమి, భుక్తి, వెట్టిచాకిరి నిర్మూలన కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నరసింహారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
ఈ పోరాటం ఫలితంగా పది లక్షల ఎకరాల భూమి పీడిత ప్రజలకు పంపిణీ చేయబడిందని, దాదాపు నాలుగు వేల మంది యోధులు అమరులయ్యారని, ఈ పోరాటమే దేశవ్యాప్తంగా భూసంస్కరణల చట్టానికి దారితీసిందని వివరించారు. నరసింహారెడ్డి ప్రజావాణిగా అసెంబ్లీలో నిలిచారని, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం నిరంతర పోరాటం చేసిన నాయకుడిగా ఆయన స్మరించాల్సిన వ్యక్తి అని అన్నారు.
ప్రస్తుతం దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై భారాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ మద్దతుతో ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు.వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండి అబ్బాస్ హాజరుకానున్నారు. సభలో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సోమ అశోక్ బాబు, మండల కమిటీ సభ్యులు మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, భూమ వెంకన్న, గుండె వేణు, పైడిపాల శేఖర్, వీరస్వామి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments