వనదేవతల దర్శనంతో మేడారం జాతర ఏర్పాట్లకు శ్రీకారం
-మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
తాడ్వాయి,తెలంగాణ ముచ్చట్లు:
తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో వనదేవతలైన శ్రీ సమ్మక్క–సారలమ్మలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) ఆదివారం దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించిన అనంతరం 2026లో జరగబోయే మహా జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరను కుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు రూ.150 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి, విద్యుత్ వసతులు వంటి అంశాలపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైందన్నారు. భక్తుల వసతి కోసం మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
ఆనంతరం తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన మంత్రి సీతక్క, కాంగ్రెస్ పట్ల విశ్వాసంతో ప్రజాపక్షంగా చేరికలు జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments