నూతన సిడిపిఓలతో మహిళా శిశు సంక్షేమానికి కొత్త శకం ప్రారంభం
టీజిపీఎస్సీ ద్వారా ఎంపికైన 23 మంది సిడిపిఓలకు నియామక పత్రాలు అందజేత
-హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:
మహిళా శిశు సంక్షేమ శాఖలో కొత్త శకానికి నాంది పలికే విధంగా, టీజిపీఎస్సీ ద్వారా సిడిపిఓలుగా ఎంపికైన 23 మందికి మంత్రి సీతక్క సచివాలయంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “సిడిపిఓలు మా శాఖకు వెన్నెముక లాంటివారు. అంకితభావంతో పనిచేస్తేనే చిన్నారులు, గర్భిణీలు, బాలింతల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి” అన్నారు.
“వేల మంది పోటీదారుల్లో మీరు ఎంపికవడం ఎంతో గర్వకారణం. ఉన్నత విద్యావంతులైన మీరంతా మా శాఖలో చేరినందుకు అభినందనలు. సేవా దృక్పథంతో మానవతా విలువలతో పనిచేసే అవకాశం ఇది” అని పేర్కొన్నారు.
ఆరు సంవత్సరాల వయస్సు వరకు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సేవ చేసే అరుదైన బాధ్యత సిడిపిఓలదని మంత్రి గుర్తు చేశారు. పోషకాహార లోపం నివారణ, దత్తత ప్రక్రియలు, మహిళా సాధికారత వంటి అంశాల్లో చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అంగన్వాడీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
“అంగన్వాడి కేంద్రాల ద్వారా పేద ప్రజలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. 57 రకాల ఆట వస్తువులు, వారంలో రెండు రోజుల బిర్యానీ, పాలూ, గుడ్లూ, యూనిఫాం వంటి అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం” అని మంత్రి వివరించారు.
ఫీల్డ్ పనికే ఎక్కువ ప్రాధాన్యత
సిడిపిఓలు కార్యాలయాలకు పరిమితం కాకుండా ఫీల్డ్‌లో పనిచేయాలని సూచించిన మంత్రి, “మీ సూచనలు, సలహాలతో అంగన్వాడీ సేవల మౌలికత మెరుగవుతుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిబద్ధతతో పనిచేయండి” అన్నారు.చివరగా, అంగన్వాడీలను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments