చిల్కానగర్ బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
ఆలయాల అభివృద్ధికి 20 లక్షల నిధుల మంజూరు
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
చిల్కానగర్ డివిజన్‌లో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయాల వద్ద అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అధికారులను ఆదేశించారు. మారల్ మైసమ్మ, పోచమ్మ, మజ్జిగౌరమ్మ ఆలయాలతో పాటు ఇతర ఆలయాల పరిసర ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారంతో లభించాయని పేర్కొన్నారు.
శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి, విద్యుత్, శానిటేషన్ శాఖల అధికారులతో కలిసి పలువురు ఆలయాలను సందర్శించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. రాత్రి వేళ భక్తులకు ఇబ్బంది కలగకుండా వీధిదీపాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆలయాలకు వచ్చే మార్గాల్లో రహదారుల్లో గుంతలు లేకుండా ప్యాచ్‌వర్క్ చేయాలని ఇంజనీరింగ్ శాఖను కోరారు. బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆలయం వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, మంచినీటి సరఫరా, విద్యుత్, వెలుగు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లను పూర్తిచేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్‌స్పెక్టర్ కేదార్, శానిటేషన్ డిపార్ట్‌మెంట్ డీఈ చందన, ఎలక్ట్రిసిటీ సిబ్బంది రాము, వాటర్ వర్క్స్ సిబ్బంది శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments