సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలే దేశ భవిష్యత్తుకు భద్రమ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:
దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరుగుతుండటమే ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రధాన ప్రమాదంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విలువలపై ఆధారపడిన సిద్ధాంతపరమైన రాజకీయాలే ప్రజాస్వామ్యాన్ని బలపరచగలవని స్పష్టం చేశారు.
జనప్రియ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి స్మారకంగా క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ఐసీఎఫ్ఏఐ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ రచయిత మోహన్ గురుస్వామికి ‘జైపాల్ రెడ్డి స్మారక పురస్కారం’ను సీఎం చేతుల మీదుగా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “జైపాల్ రెడ్డి దేశ రాజకీయాల్లో సిద్ధాంతాలకు నిలువెత్తు నిదర్శనం. విద్యార్థి నాయకుడిగా మొదలుపెట్టి కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం దేశానికి సేవలందించారు. పెట్రోలియం శాఖ, సమాచార శాఖ మంత్రిగా కీలకమైన చట్టాలు తీసుకొచ్చి ప్రజాస్వామ్య బలానికి దోహదపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన చూపిన చొరవ మరచిపోలేనిది.”
ఇప్పటి రాజకీయాలు విలువలమీద కాకుండా వేగంగా డెలివరీ చేసే ‘స్విగ్గీ పాలిటిక్స్’వైపు వెళ్తుండటాన్ని ఆయన విమర్శించారు. “సిద్ధాంతాల కోసం పనిచేసే నాయకులు తగ్గిపోతున్నారు. కార్యకర్తల స్థానంలో వాలంటీర్స్ వస్తున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం,” అని అన్నారు.
జైపాల్ రెడ్డి, పీవీ నరసింహారావు లాంటి నాయకులు తెలంగాణకు మాత్రమే కాకుండా దేశానికి గౌరవం తీసుకొచ్చారని, వారి స్పూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంగా ముందుకు నడిపే ప్రభుత్వమే ప్రజల ఆకాంక్షల నెరవేర్చగలదన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా. సస్మిత్ పాత్ర, క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పురుశోత్తం రెడ్డి, ఐసీఎఫ్ఏఐ చైర్‌పర్సన్ యశస్వీ శోభారాణి, వైస్ చాన్సలర్ ఎల్ఎస్. గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments