పాలకుర్తిలో ఉక్కులాంటి యువతరం తయారు కావాలి
డీసీపీ రాజా మహేంద్ర నాయక్
పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి మండలకేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వాగత తోరణం ఎదురుగా స్థాపించిన ఛం జిమ్ సెంటర్‌ను డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని వ్యాయామ శిక్షకుడు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ...యువతలో వ్యాయామ పరంగా చైతన్యం పెంచడం హర్షణీయమని, పాలకుర్తిలో ఇదే మొదటి వ్యాయామ కేంద్రంగా గుర్తుంచుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు మందులు, చికిత్సలకు మాత్రమే పరిమితం కాకుండా వాకింగ్, జాగింగ్, యోగా, జిమ్ వంటి సాధనాల ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వయస్సు, లింగం, సామాజిక-ఆర్థిక పరిస్థితుల తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమకు అనుకూలంగా వ్యాయామ సమయాన్ని కేటాయించుకోవాలన్నారు. చిన్నారుల ఎదుగుదలలో శారీరక శ్రమ, పౌష్టికాహారం కీలకమైందని పేర్కొన్నారు. జిమ్‌కు వెళ్లే యువత తప్పనిసరిగా నిపుణుల సూచనలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి సీఐ జానకిరాం రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, పలువురు యువకులు పాల్గొన్నారు.
Comments