రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ల కుటుంబాలకు టీజీఎస్‌ఆర్టీసీ భరోసా
ఉచిత ప్రమాద బీమా ద్వారా రూ.కోటి ఆర్థిక సహాయం
కుషాయిగూడ, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
రోడ్డు ప్రమాదాల్లో విధులకు వెళ్తూ అకాల మరణం చెందిన ఉద్యోగుల కుటుంబాలకు టీజీఎస్‌ఆర్టీసీ అండగా నిలిచింది. కుషాయిగూడ, ఉప్పల్ డిపోలకుచెందిన ఇద్దరు డ్రైవర్లు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా, వారి కుటుంబాలకు ఉచిత ప్రమాద బీమా పథకం కింద రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసి భరోసా కల్పించింది.కుషాయిగూడ డిపో డ్రైవర్ ఎ. వెంకటేష్, ఉప్పల్ డిపోకు చెందిన డి.ఆర్. గౌడ్లు వేర్వేరు సందర్భాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్దదిక్కు మృతి చెందడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ కష్ట సమయంలో టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న యూబీఐ సూపర్ సాలరీ సేవింగ్స్ అకౌంట్ వారికి ఎంతో ఉపయోగపడింది.సంస్థ సూచనల మేరకు ఉద్యోగులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సూపర్ సాలరీ సేవింగ్స్ అకౌంట్ తెరిచి రూపే కార్డులు తీసుకోవడంతో ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించింది. ఈ పథకం కింద ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు యూబీఐ రూ.కోటి వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది.ఈ మేరకు శనివారం బస్సు భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమ్రేష్ ప్రసాద్, బ్యాంక్ సిబ్బందితో కలిసి టీజీఎస్‌ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి, ఐపీఎస్ బాధిత కుటుంబాలకు రూ.కోటి విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వై. నాగిరెడ్డి మాట్లాడుతూ, తమ తప్పు లేకున్నా రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లు అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి టీజీఎస్‌ఆర్టీసీ ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని, పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబాలకు సంస్థ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఆపద సమయంలో ఉపయోగపడే పథకాలను నిర్లక్ష్యం చేయకుండా వినియోగించుకోవాలని సూచించారు. ఈ అవకాశం కల్పించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.డ్రైవర్ ఎ. వెంకటేష్ తన ఇంటి నుంచి విధుల కోసం ద్విచక్ర వాహనంపై కుషాయిగూడ డిపోకు వస్తుండగా, కీసర సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ డిపో మేనేజర్ వి. వేణుగోపాల్‌తో పాటు బస్సు భవన్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments