4 లేబర్ కోడ్ల రద్దుకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటం
కుషాయిగూడ, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 2026 ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కె.ఉన్నికృష్ణన్ పిలుపునిచ్చారు.కుషాయిగూడలో మధ్యాహ్న భోజన కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ చట్టం–2025, విబిజి–రామ్‌జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి వంటి నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు తీవ్రంగా విరుద్ధమని విమర్శించారు.కార్మికుల రక్త త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 2019–2020 సంవత్సరాల్లో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని తెలిపారు. కార్మిక సంఘాల నిరంతర పోరాటాల వల్ల ఇప్పటివరకు వాటి అమలు ఆలస్యమైందని, అయితే 2025 నవంబర్ 21న లేబర్ కోడ్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.
కార్మిక సంఘాలు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వేళ, ఫ్లోర్ లెవల్ వేతనం పేరుతో రోజుకు కేవలం రూ.178 మాత్రమే నిర్ణయించడం కార్మికుల జీవితాలతో చెలగాటమని అన్నారు. నెలకు రూ.4,628తో కుటుంబాలు ఎలా జీవించాలన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.2013లో జరిగిన 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌లో స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి హక్కులు కల్పించాలని తీర్మానం చేసినప్పటికీ, నేటికీ వాటి అమలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కీమ్‌లను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వాటాను తగ్గించి, నీతి ఆయోగ్ ద్వారా స్కీమ్‌లను ఎప్పుడైనా నిలిపివేసే పరిస్థితిని తీసుకొచ్చిందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో స్కీమ్‌ల రక్షణకై, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత సాధన కోసం ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కె.ఉన్నికృష్ణన్ పిలుపునిచ్చారు.


Comments