దివంగత నటుడు కోట సతీమణి కోట రుక్మిణి హఠాన్మరణం
హైదరాబాద్, ఆగస్టు 18:
దివంగత నటుడు కోట శ్రీనివాసరావు సతీమణి కోట రుక్మిణి హఠాన్మరణం చెందారు. అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందినట్టు సమాచారం. ఇటీవలే కోట శ్రీనివాసరావు చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించినట్టు తెలుస్తోంది. రుక్మిణి వయస్సు 75 సంవత్సరాలు.సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రుక్మిణి కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఇలా ఉండగా దివంగత నటుడు కోట శ్రీనివాసరావు(83) జులై 13 ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానం స్మశానవాటికలో కోట అంత్యక్రియలు జరిగాయి.
1942 జులై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట జన్మించారు. 1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు. 750కి పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నటించారు. ప్రతిఘటన సినిమాతో విలన్‌గా మంచి గుర్తింపు పొందారు. 2015లో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. కోట 9 నంది అవార్డులు, సైమా అవార్డు అందుకున్నారు. కాగా, ఇప్పుడు కోట భార్య కూడా తనువు చాలించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Comments