కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సంస్కరణల వల్ల ఇప్పటికే ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో మరింత సౌకర్యవంతంగా ఉండేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించి సమీకృత భవనాల్లో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 సమీకృత భవనాల్లోకి తీసుకురానున్నామని మంత్రి తెలిపారు. గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో రంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్‌తో పాటు గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ కార్యాలయాలను సమీకరిస్తున్నామని వివరించారు. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రోల్ మోడల్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20న గచ్చిబౌలిలో ఈ భవనానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
అబ్దుల్లాపూర్ మెట్, పెద్దఅంబర్‌పేట్, హయత్‌నగర్, వనస్థలిపురం పరిధిలో కోహెడ్‌లో, మహేశ్వరం, ఇబ్రహింపట్నం, శంషాబాద్ పరిధిలో మహేశ్వరం మండలంలోని మంకాల్‌లో, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కీసర, శామీర్‌పేట్ పరిధిలో కండ్లకోయలో, ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరి పరిధిలో బోడుప్పల్‌లో, బంజారాహిల్స్, ఎస్.ఆర్.నగర్, గోల్కొండ పరిధిలో బంజారాహిల్స్‌లో, ఆజంపుర, చార్మినార్, దూద్‌బౌలి పరిధిలో మలక్‌పేట్‌లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. మరో పదమూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం నాలుగు చోట్ల స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు.
ప్రజల సమయాన్ని ఆదా చేయడానికి, పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలు అందించడానికి స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఏప్రిల్ 10 నుంచి ప్రారంభించిన ఈ విధానం జూన్ 2 నాటికి రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమల్లోకి వచ్చిందని, ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల స్లాట్ బుకింగ్‌లు నమోదయ్యాయని తెలిపారు. ప్రజల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడానికి త్వరలో ఈ-ఆధార్ విధానాన్ని కూడా అమలు చేయనున్నామని చెప్పారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలవుతున్న ఈ విధానాన్ని త్వరలో అన్ని కార్యాలయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు.స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడటం లేదని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి పోంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


Comments