అభివృద్ది పనులకు శంకుస్థాపన
భీమదేవరపల్లి, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):
ముల్కనూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతూ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి శనివారం పలు పనులను ప్రారంభించారు. గ్రామంలోని శ్రీనివాస కాలనీలో చాలాకాలంగా మురుగు కాలువలు మరియు అంతర్గత రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో మురుగు నీరు రోడ్లపైకి వచ్చి కాలనీవాసులకు నడిచే పరిస్థితి లేకపోవడం, రోజువారీ జీవనానికి ఆటంకం కలగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సి.సి రోడ్డు నిర్మాణం మరియు మురికి నీటి కాలువల నిర్మాణ పనులను సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి ప్రారంభించారు. ఈ పనులు పూర్తయిన తర్వాత కాలనీలో పారిశుధ్యం మెరుగుపడటంతో పాటు రవాణా సౌకర్యం కూడా సులభమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. గ్రామంలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పంచాయతీ కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమైన రోడ్లు, కాలువలు, పారిశుధ్య పనులను దశలవారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు కూడా గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుంచు చంద్రమౌళి, గద్వాల సుకన్య, దొంతరబోయిన కోమల, పల్లె తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలియజేసి ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.


Comments