ఎన్‌ఎఫ్‌సి బ్రిడ్జి విస్తరణకు 16న ధర్నా

మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో నిరసనకు సీపీఎం పిలుపు

మల్లాపూర్, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):

కాప్ర సర్కిల్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)ను తక్షణమే విస్తరించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలో వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయని సీపీఎం కాప్ర సర్కిల్ కమిటీ కార్యదర్శి జి. శ్రీనివాసులు తెలిపారు.ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ఉద్యోగులు,విద్యార్థులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రమాదాల ముప్పు కూడా పెరిగిందని, ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలు సకాలంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల సౌకర్యం, భద్రత దృష్ట్యా ఎన్‌ఎఫ్‌సి రైల్వే ఓవర్ బ్రిడ్జి విస్తరణకు తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి మార్చి 16న సోమవారం సాయంత్రం 5 గంటలకు మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.స్థానికులు, వాహనదారులు, వివిధ కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News