భవన నిర్మాణ కార్మికులందరికీ పట్టణ ఉపాధి పథకం అమలు చేయాలి
సిఐటియు నాయకులు డి.నగేష్ డిమాండ్
కీసర, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో పనిచేస్తున్న అడ్డా కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు కార్మికులతో సమావేశం నిర్వహించినట్లు జవహర్ నగర్ సిఐటియు నాయకులు డి.నగేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, జవహర్ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కార్మికులందరికీ బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కమిటీ నాయకులు బంగారు నర్సింగరావు మాట్లాడుతూ మహానగరంలో అడ్డా కార్మికుల జీవితం ఎంతో దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన అనేక మంది కార్మికులు అడ్డాల వద్ద పని కోసం ఎదురు చూస్తూ జీవనం సాగిస్తున్నారని, పని దొరకక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకంగా పట్టణ ఉపాధి పథకం రూపొందించి సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, అలాగే కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.అడ్డాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడం, మహిళల కోసం మూత్రశాలలు ఏర్పాటు చేయడం, వేసవిలో వాటర్ క్యాంపులు ఏర్పాటు చేయడం, తాత్కాలిక షెడ్లు నిర్మించడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు రూ.5 భోజన పథకం అమలు చేయడం, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడం, బేషరతుగా వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వడంతో పాటు 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10,000 పింఛన్ అమలు చేయాలని కూడా కోరారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు టి.శివన్నారాయణతో పాటు నాయకులు రాములు, కుమార్, వర్మ, నరసింహ, ఎల్లయ్య, లక్ష్మి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.


Comments