కమలానగర్‌లో కార్ల్ మార్క్స్, ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ సంస్మరణ సభ
కాప్రా, మార్చ్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం కమలానగర్ కార్యాలయంలో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్ 143వ వర్ధంతి, ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 147వ జయంతి, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 8వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.ముందుగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి సామాజిక ఉద్యమ నాయకులు సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. ఐన్స్టీన్ చిత్రపటానికి సామాజిక ఉద్యమ నేత జయరాజు, స్టీఫెన్ హాకింగ్ చిత్రపటానికి ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ నాయకులు శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ ప్రపంచవ్యాప్తంగా సామాజిక మార్పుకు దారి చూపిన గొప్ప తత్వవేత్త అని పేర్కొన్నారు. సమాజంలోని వర్గ విభజనలను విశ్లేషించి కార్మిక వర్గ హక్కుల కోసం పోరాట మార్గాన్ని సూచించిన మహనీయుడని తెలిపారు. అలాగే ఐన్స్టీన్ రూపొందించిన సాపేక్ష సిద్ధాంతం శాస్త్ర ప్రపంచానికి కొత్త దారులు చూపిందని, స్టీఫెన్ హాకింగ్ తన శారీరక పరిమితుల మధ్య కూడా విశ్వ రహస్యాలపై గొప్ప పరిశోధనలు చేసి ప్రపంచానికి మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు.అటువంటి మహనీయుల ఆలోచనలు సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని నాయకులు తెలిపారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాస్, లక్ష్మయ్య, నరసయ్య, వెంకటేష్, శోభ, గౌసియా, శారద, అనురాధ, నారాయణరావు, బంగారు నర్సింగరావు, ఉమామహేశ్వరరావు, సత్య, ఆర్.ఎస్.ఆర్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments