గ్రానైట్ మాఫియాపై బీజేపీ మౌనం ఎందుకు?
*అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.*
*ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విధానాన్ని రద్దు చేయాలి: బండారి శేఖర్.*
*కరీంనగర్, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):*
అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసిన గ్రానైట్ అక్రమాలు, పన్నుల ఎగవేత, విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనలు, కేంద్ర ప్రభుత్వ పశుసంపద అభివృద్ధి పథకంలో అవినీతి ఆరోపణలపై ఎందుకు మౌనం వహిస్తోందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విధానాన్ని రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ.. కరీంనగర్ గ్రానైట్ వ్యాపారంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాల వెనుక ఉన్న రాజకీయ నాయకుల పాత్రను కూడా సమగ్రంగా విచారించాలని కోరారు. పన్నుల ఎగవేత, విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యల పురోగతిపై స్పష్టత లేదని విమర్శించారు. గతంలో గ్రానైట్ వ్యవహారానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో రూ.1.08 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెలువడిన సమాచారం నేపథ్యంలో దర్యాప్తు పురోగతిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ పశుసంపద అభివృద్ధి పథకంలో కరీంనగర్ జిల్లాలో నిధుల వినియోగం, పశువుల కొట్టాల నిర్మాణం, పశువుల కొనుగోలు, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు అని, ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో అర్హులైన ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోకూడదని అన్నారు. ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు కలిగిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈ అంశాలపై సమాధానం చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సంబంధిత దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని బండారి శేఖర్ కోరారు. అవినీతిపై పోరాటం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని స్పష్టం చేశారు.
ఈ ధర్నాలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు ప్రవీణ్, లక్ష్మయ్య, బన్నీ, రవీందర్, అఖిల్, రమేష్ సాగర్, అనిల్, సాయి, మహిళా నాయకులు రాజమణి, లక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.


Comments