కేటిఆర్ ఆదేశాల మేరకు మైదం మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సహాయం
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే ఆత్మహత్యకు కారణమని ఆరోపణ
– 50 లక్షల ఎక్స్‌గ్రేషియా డిమాండ్
-కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలలి
-బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి
ములుగు,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
ములుగు జిల్లా మాధవరావుపల్లి గ్రామానికి చెందిన పారిశుద్ధ కార్మికుడు మైదం మహేష్ గత ఐదు నెలలుగా వేతనం అందక మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. బాధిత కుటుంబానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రూ.5.50 లక్షల ఆర్థిక సహాయాన్ని ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు మంగళవారం మహేష్ నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ, మైదం మహేష్ ఆత్మహత్య ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని తీవ్రంగా విమర్శించారు. ప్రతి నెల వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, మైదం మహేష్ ఆత్మహత్య దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
మహేష్ మరణాన్ని వక్రీకరించి, తప్పుడు వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం ప్రభుత్వ దురుద్దేశపూరిత చర్య అని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని హెచ్చరించారు. ములుగు మున్సిపాలిటీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం వల్లే కుటుంబం కష్టాల్లో కూరుకుపోయిందని, ఈ పరిస్థితుల్లో ముగ్గురు బాలికలకు దిక్కుగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
మహేష్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, పిల్లల చదువుకుపూర్తి బాధ్యతతో పాటు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ప్రజల నుంచి సేకరించిన రూ.1,01,116 సహాయం కూడా మహేష్ కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, పల్లెపు శ్రీనివాస్, లింగాల రమణారెడ్డి, లకావత్ నరసింహ నాయక్, కుడుముల లక్ష్మీనారాయణ, జెడ్పిటిసి మాజీ సభ్యులు, సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments