మున్సిపల్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి : సిఐటియు
మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపల్ కార్మికులకు మూడు నెలల వేతనాలు, అలియాబాద్ మున్సిపల్ కార్మికులకు రెండు నెలల వేతనాలు బకాయిలుగా ఉన్నాయని వెంటనే చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాధిక గుస్తా కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రతి నెల జీతం మీద ఆధారపడి కుటుంబాలు నడిపే నిరుపేద మున్సిపల్ కార్మికులు మూడు నెలలుగా జీతం రాక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల గురించి 24 గంటలు మాట్లాడుతుంది కానీ పేద కార్మికుల జీతాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతోంది” అని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు ప్రతి నెలా ఒకటో తేదీకి జీతాలు వస్తుంటే చిన్న వేతనాలు పొందే మున్సిపల్ కార్మికులకు మాత్రం జీతాలు బకాయిలు పెట్టడం అన్యాయం అన్నారు. వెంటనే బకాయిలను చెల్లించి ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ నాయకులు ప్రశాంత్, శ్రీను, సిఐటియు నాయకులు సంతోష్, కిష్టప్ప, ఉన్నికృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.


Comments