హాస్టల్ వర్కర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం
సత్తుపల్లి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న హాస్టల్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐదో రోజు కూడా నిరవధిక సమ్మె కొనసాగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మెలో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి కు కార్మికులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కొలికపోగు సర్వేశ్వరరావు మాట్లాడుతూ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌మెట్రిక్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో జారీ చేసిన జిఓ 527 అమలు కారణంగా ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు రూ.12 వేల నుండి రూ.9,200కి తగ్గించారని, అలాగే 2021లో తెచ్చిన జిఓ 64 వల్ల డైలీవేజ్ వర్కర్లకు నెలకు రూ.4 వేల నుండి రూ.12 వేల వరకు వేతనాలు తగ్గాయని విమర్శించారు.
వెంటనే ఈ జిఓలను రద్దు చేసి, జిఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు 10 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, వెంటనే విడుదల చేయాలని, కనీస వేతనం రూ.26 వేల రూపాయలు చొప్పున చెల్లించాలని కోరారు. గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయడంతో పాటు ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వారసత్వ నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్మికులు సీతారత్నం, లక్ష్మీదేవి, పార్వతి, సత్యావతి, లక్ష్మి, నాగమణి, ఎల్లమ్మ, పద్మ, జమలమ్మ, సునీత, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments