నీట్ పీజీలో వనపర్తి రిత్విక్ రెడ్డికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్ సాధన
వనపర్తి,సెప్టెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వైద్య విద్యలో వనపర్తి జిల్లా మరో విశేష గౌరవాన్ని సొంతం చేసుకుంది. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన స్వప్న, భాస్కర్ రెడ్డి దంపతుల కుమారుడు డాక్టర్ సురవరం రిత్విక్ రెడ్డి, నీట్ పీజీ-2025 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్, జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్‌ను సాధించారు.
2019లో జరిగిన నీట్ అండర్‌గ్రాడ్యుయేట్ పరీక్షలో 430 ర్యాంక్‌తో ఎంపికైన రిత్విక్ రెడ్డి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వైద్య విద్యపై ఉన్న తపనతో 2025 నీట్ పీజీ పరీక్షకు స్వయంగా సన్నద్ధమై, 684 మార్కులు సాధించి దేశవ్యాప్తంగా 16వ ర్యాంక్ సాధించారు.
ఈ సందర్భంగా కాళోజి హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసిన పీజీ ర్యాంకుల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మొత్తం 7,179 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు ప్రకటించింది. అందులో రిత్విక్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానం దక్కించుకున్నారు.
కుమారుడి విజయానికి తల్లి స్వప్న గారి తపన, తండ్రి భాస్కర్ రెడ్డి గారి ప్రోత్సాహం ముఖ్య కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ అవసరాలను తగ్గించుకొని, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ద్వారా స్వప్న తన కుమారుడి విద్యాభ్యాసానికి అండగా నిలిచినట్టు తెలిసింది. నానమ్మ, తాతయ్యల ఆశీస్సులు, తల్లిదండ్రుల కృషి, తన పట్టుదలతోనే ఈ విజయం సాధ్యమైందని రిత్విక్ రెడ్డి పేర్కొన్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించిన డాక్టర్ రిత్విక్ రెడ్డిని పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు అభినందిస్తున్నారు.
Comments