పెన్షన్ పెంపు వరకు పోరాటం ఆగదు
ఎమ్మార్పీఎస్ నాయకులు
పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
పెన్షన్లు పెంచేంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదలబోమని ఎమ్‌ఆర్‌పిఎస్ నాయకులు స్పష్టం చేశారు. పెద్దలు, వికలాంగులు, వితంతువులను మోసం చేసిన ముఖ్యమంత్రికి పాలన చేయడానికి నైతిక అర్హత లేదని అన్నారు. పెన్షన్లు పెంచకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పెద్దమందడి మండల కేంద్రంలోని మండల రెవెన్యూ అధికారి కార్యాలయాన్ని పెన్షన్ దారులు ముట్టడించారు. మండల బాధ్యులు ఎద్దుల వెంకటేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో కొమ్ము చెన్నకేశవులు మాదిగ, టైగర్ జంగయ్య మాదిగ, గంధం గట్టయ్య తదితరులు మాట్లాడారు.
ఎన్నికల హామీపై విమర్శలు
"2023 ఎన్నికల సమయంలో వికలాంగులకు ఆరు వేల రూపాయలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు మాట నిలబెట్టుకోలేదు. ఏడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు మంజూరు కాక పేదల గోస వినిపించడం లేదు" అని వారు ప్రశ్నించారు.
ప్రభుత్వంపై ఆరోపణలు
భూస్వాములకు రైతు బంధు, రుణ మాఫీ అమలు చేస్తున్న ప్రభుత్వం అత్యంత పేదలకు పెన్షన్లు పెంచకపోవడం అన్యాయం అని మండిపడ్డారు. పెన్షన్ దారులను దగా చేస్తున్నా ప్రతిపక్షాలు కూడా నోరు విప్పకపోవడం విచారకరమని అన్నారు.
భవిష్యత్ పోరాటాల హెచ్చరిక
ఈ నెల ఇరవై తేదీన అన్ని గ్రామ పంచాయితీల వద్ద మహాధర్నాలు, తరువాత రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధాలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబరు రెండో వారంలో లక్షలాది మంది పెన్షన్ దారులతో హైదరాబాద్‌లో మహాగర్జన సభ నిర్వహించి తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.
ధర్నా అనంతరం పెన్షన్లకు సంబంధించిన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ రమేష్ మురళి గౌడ్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బంజారా సేవాలాల్ సేవా సమితి అధ్యక్షుడు కిషన్ నాయక్, హనుమంతు మాదిగ, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితరులు పాల్గొన్నారు.
Comments