గ్రీన్ ఫీల్డ్ హైవే సమస్యల పరిష్కారానికి కృషి..
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 15, తెలంగాణ ముచ్చట్లు;
గ్రీన్ ఫీల్డ్ హైవే కు సంబంధించిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ సేకరణ సమస్యలపై సంబంధిత వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండల రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సూచనల మేరకు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హై వే కు సంబంధించి రైతుల సమస్యలను నోట్ చేసుకోవడం జరిగిందని, జిల్లా స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చూడాలని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద సర్వీస్ రోడ్డు డిమాండ్ ను జాతీయ రహదారుల అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తానని, హైవే వద్ద ఉన్న డ్రెయిన్స్ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
భూ సేకరణ సంబంధించి రేట్ ను తన పరిధి మేరకు ఆర్బిట్రేషన్ లో మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు అన్యాయం చేయాలని ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, జాతీయ రహదారి రావడం వల్ల మన భూముల విలువ పెరుగుతుందని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను ధర్నాలతో అడ్డుకోవద్దని కలెక్టర్ కోరారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా నిబంధనల మేరకు న్యాయం చేసేందుకు తాను కృషి చేస్తానని అన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న 40 కి.మీ. కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే కు తప్పనిసరిగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జి, సర్వీస్ రోడ్డు ఉండాలని, లేని పక్షంలో రైతులకు చాలా ఇబ్బందులు వస్తాయని, వరదల సమయంలో నీరు పొలాలకు వెళ్లడం వల్ల ఆర్థికంగా కూడా రైతులు నష్టపోతారని, వీరికి తగిన న్యాయం చేయాలని అన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద సర్వీస్ రోడ్డు వేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా చేయాలన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలలో రోడ్ల విధ్వంసం జరిగిందని అక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ వల్ల రైతులకు వ్యవసాయం చేయడం సాధ్యం కావడం లేదని, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని అన్నారు. హైవే నిర్మాణ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సర్వీస్ రోడ్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నేషనల్ హై వే పి.డి. దివ్య, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments