భద్రాద్రి కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అవసరం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై చర్చించేందుకు కలిసారు.
ఇప్పటికే ఒక స్థలంలో ఫీజిబిలిటీ సర్వే పూర్తి అయినప్పటికీ, అనుకూల ఫలితాలు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో స్థలాన్ని ప్రతిపాదించింది. తుమ్మల నాగేశ్వరరావు స్థానిక వాతావరణం, భౌగోళిక పరిస్థితులు పరిశీలించి, త్వరితగతిన సర్వే పూర్తిచేసి ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, “దక్షిణ అయోధ్య”గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు రాకపోకలు సులభం అవుతాయని, సింగరేణి గనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ–బీపీల్ వంటి పరిశ్రమలు, అరుదైన ఖనిజ సంపద, ఎకో టూరిజం కేంద్రాలతో జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందిందని తుమ్మల గుర్తుచేశారు.
తుమ్మల నాగేశ్వరరావు “తెలుగు బిడ్డ రాంమోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కల త్వరలోనే సాకారం అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది” అని స్పష్టం చేశారు.
Comments