పెన్షన్ పెంచకపోతే ఉద్యమం తీవ్రతరం
మల్కాజిగిరి తహసిల్దార్ కార్యాలయ ముట్టడి చేసిన వికలాంగులు, సంఘ నాయకులు
మల్కాజిగిరి, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)
రాష్ట్రంలో పెన్షన్‌దారులు, వికలాంగులు ఎదురు చూస్తున్న పెన్షన్ వృద్ధి కోసం పోరాటం ముదురుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలను అమలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు సోమవారం మల్కాజిగిరి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు."హామీ నెరవేర్చాలి – పెన్షన్ పెంచాలి" అంటూ నినాదాలు చేసిన నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ మాట్లాడుతూ ఎన్నికల ముందు వికలాంగులకు 4 వేల నుండి 6 వేల, సాధారణ పెన్షన్ దారులకు 2 వేల నుండి 4 వేల పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారం లోకి వచ్చి 20 నెలలు గడిచినా మాట నిలబెట్టుకోలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం” అని విమర్శించారు.ఇకపై హామీ అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజల జీవనాధారం అయిన పెన్షన్ పెంపు సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments