ఆలోచనలు మారితేనే ఆర్థిక పరిస్థితులు మారుతాయి
ఆర్ధిక విద్య ప్రతి మహిళ తప్పనిసరిగా అలవర్చుకోవాల్సిన జీవన నైపుణ్యం
కర్నూల్ ఆశోక ఇంజినీరింగ్ కళాశాలలో మహిళల ఆర్థిక స్వావలంబనపై అవగాహన వర్క్‌షాప్
-ప్రధాన వక్తగా డాక్టర్ తాటికొండ క్రాంతి రాజ్
హన్మకొండ/కర్నూల్(తెలంగాణ ముచ్చట్లు):
మహిళలు ఆత్మనిర్భరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందించేందుకు ఆశోక మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రత్యేక ఆర్థిక అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. “మాస్టర్ యువర్ మైండ్ – వెల్త్ సేవింగ్ అండ్ స్మార్ట్ ఇన్వెస్టింగ్ ఫర్ యంగ్ విమెన్” అనే శీర్షికతో జరిగిన ఈ కార్యక్రమంలో నెక్స్‌ట్ జెన్ హెల్త్ కలెక్టివ్ వ్యవస్థాపకుడు, ఎస్ఈబిఐ నోందణ కలిగిన పరిశోధన విశ్లేషకుడు డా. క్రాంతి రాజ్ తాటికొండ ప్రధాన వక్తగా పాల్గొన్నారు.
విద్యార్థినులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆర్థిక విద్య ఒక్క వాణిజ్య విద్యార్థులకే పరిమితం కాకుండా, ప్రతి మహిళ తప్పనిసరిగా అలవర్చుకోవాల్సిన జీవన నైపుణ్యమని పేర్కొన్నారు. “డబ్బు ముందుగా మనసులో సంపాదించాలి. ఆలోచనలు మారితేనే ఆర్థిక పరిస్థితులు మారతాయి” అని పేర్కొన్నారు. చిన్న మొత్తాలతో ప్రారంభించడం, భావోద్వేగాలను అదుపులో ఉంచడం, లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం, బడ్జెట్ పద్ధతి పాటించడం వంటి అంశాలను స్పష్టంగా వివరించారు.
“పెట్టుబడుల్లో పెద్ద మొత్తాలకంటే క్రమశిక్షణ ముఖ్యం. ఆర్థికంగా స్వతంత్రురాలైన మహిళ తన జీవితం మాత్రమే కాదు, తన కుటుంబం మరియు సమాజ దిశను కూడా మార్చగలదు” అని ఆయన విద్యార్థినులను ప్రేరేపించారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, నెలసరి పెట్టుబడులు, ప్రమాద నిర్వహణ, ట్రేడింగ్ ఆలోచనా విధానం వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడంతో విద్యార్థినులు ఆసక్తిగా ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
కళాశాల సిఈఓ డా. హారిస్ కృష్ణ మాట్లాడుతూ, మహిళలలో ఆర్థిక అవగాహన పెంపొందించడం కాలానికి అనుగుణంగా అత్యవసరమని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థినులు అనవసర ఖర్చులను తగ్గించి, క్రమం తప్పకుండా పొదుపు చేసి పెట్టుబడులు పెట్టే సంకల్పం చేశారు.



Comments