నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన – మాజీ ఎంపీ నామ
ప్రజా సంక్షేమమే పరమావధి
మాజీ ఎంపీ నామ
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)
బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, విజయాలు, శాంతి నింపాలని ఆయన ఆకాంక్షించారు. గత సంవత్సరం ఎదురైన కష్టాలు, సవాళ్లు కొత్త సంవత్సరంలో తొలగిపోయి, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని పేర్కొన్నారు. రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని, కష్టానికి తగిన గిట్టుబాటు ధరలు లభించాలని, ఈ ఏడాది అయినా యూరియా కొరత సమస్యలు పూర్తిగా తొలగాలని నామ ఆకాంక్షించారు. యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడాలని, వారి కలలు సాకారం కావాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజ లో ఉండాలని, వారి భద్రత, గౌరవం కాపాడబడాలని పేర్కొన్నారు. విద్యార్థులు చదువులో రాణించి ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని, అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ, ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతానని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం బాధాకరమని తెలిపారు. కనీసం ఈ ఏడాది అయినా ప్రజల ఆకాంక్షలను గౌరవించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ప్రజలందరికీ శుభప్రదంగా ఉండాలని భగవంతున్ని నామ ప్రార్థించారు


Comments