విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పోటు రవీందర్ రెడ్డి
మంచిర్యాల బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
వర్షాకాలం అయినందున విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పోటు రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో వసతి గృహాల నిర్వహణపై సంక్షేమ అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి మాట్లాడుతూ, జిల్లాలోని 17 ప్రీ మెట్రిక్, 8 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వసతి గృహాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని, జ్వరాల బారిన పడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి ప్రత్యేక భోజనం అందించి ప్రత్యేక గదిలో ఉంచి ఎప్పటికప్పుడు సరైన వైద్య సేవలు, మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకొని వసతి గృహాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, కాచి చల్లార్చి వడపోసిన శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, వసతి గృహ రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని, ఉన్నతాధికారులు ఆకస్మికంగా సందర్శించినప్పుడు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని తెలిపారు. వసతి గృహ సంక్షేమాధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, స్థానికతను పాటించని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారి యం. రవీందర్, వసతిగృహ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments