ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇచ్చిన ప్రతి మాట, హామి అమలుకు కృషి....
రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇచ్చిన ప్రతి మాట, హామి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి, ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి సత్యనారాయణ పురం టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబు లతో కలిసి 36 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం క్రింద ఒక్కో జంటకు లక్షా 116 రూపాయల చొప్పున మొత్తం 36 లక్షల 4 వేల 176 రూపాయలను, అలాగే 92 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మొత్తం 32 లక్షల 29 వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి కృషి చేస్తూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని క్రమ పద్ధతిన అమలు చేయడం జరుగుతుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల ద్వారా ప్రభుత్వం అందించే సహాయం ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ జి. గణేష్, ఖమ్మం రూరల్ మండల తహశీల్దార్ రాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments