రైతులు లాభదాయక ఆయిల్ పామ్ పంట వేయాలి.
.....రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు
రైతు సంక్షేమ పథకాలను క్రమ క్రమంగా అమలు చేస్తున్నాం
రఘునాధపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
రఘునాథపాలెంమండలంలోని రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలంలోని కోటపాడు, వి.ఆర్. బంజర, జి.కె. బంజర, పాపటపల్లి , చిమ్మపూడి గ్రామాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసారు.ఈ సందర్భంగా మంత్రి, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. నిధులతో జి.కె. బంజర గ్రామంలో రూ. 17 లక్షల అంచనాతో చేపట్టే 5 అంతర్గత సిసి రోడ్ల పనులకు, వి.ఆర్. బంజర గ్రామంలో రూ. 21 లక్షలతో చేపట్టే 4 అంతర్గత సీసీ రోడ్డు పనులకు, పాపటపల్లి గ్రామంలో రూ. 13.5 లక్షలతో చేపట్టే 10 అంతర్గత సీసీ రోడ్డు పనులకు, కోటపాడు గ్రామంలో రూ. 56 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టిన 23 అంతర్గత సిసి రోడ్డు నిర్మాణ పనులకు, చిమ్మపూడి గ్రామంలో రూ. 90 లక్షలు వ్యయంతో చేపట్టిన 20 అంతర్గత సిసి రోడ్ నిర్మాణ పనులకు, సి.ఆర్.ఆర్. నిధుల ద్వారా రూ. 2 కోట్ల 85 లక్షల వ్యయంతో చేపట్టిన కోటపాడు నుంచి పాపటపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో, సరిగ్గా పూర్తి చేయాలని మంత్రి అన్నారు. మండలంలో స్థలం ఉండి, ఇండ్లు లేని పేదల జాబితా (గుడిసెలు, రేకుల ఇండ్లలో ఉన్న వారి) జాబితా ఫోటోలతో సహా తయారు చేయాలని, వివరాలను పంచాయతీ కార్యదర్శుల ద్వారా సేకరించాలని మంత్రి అన్నారు. ఖమ్మం నుంచి డోర్నకల్ వెళ్లే బస్సు బుగ బంజరా గ్రామం వయా వెళ్లే విధంగా చూడాలని ప్రజలు కోరారు. ఈ అంశాన్ని పరిశీలించి ప్రజల ప్రయోజనార్థం చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. పామాయిల్ సాగు చేసిన, మిర్చి పంట అంతర్ పంట కింద సాగు చేయవచ్చని, రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని మంత్రి సూచించారు. 2 లక్షల పై రుణాలు ఉన్న రైతులకు కూడా త్వరలో షెడ్యూల్ ప్రకటించి రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని, రైతు భరోసా పథకం త్వరలో అమలు అవుతుందని మంత్రి తెలిపారు. పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, రైతుల తరపున పూర్తి స్థాయిలో భీమాను ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. రఘునాథపాలెం మండలం రైతులు పూర్తి స్థాయిలో ఆయిల్ పామ్ పంటలు వేయాలని, రాబోయే నెలలో ఎత్తిపోతల పథకం పెట్టి మండలంలోని అన్ని గ్రామాలకు సాగర్ నీళ్లు తీసుకు వచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని, ధైర్యంగా రైతులంతా మొక్కలు వేయాలని, రైతులకు మంచి ఆదాయం వస్తుందని అన్నారు. జమ్ములబాగు బావిలో క్లీనింగ్ చేయాలని, త్రాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రెండు పడక గదుల పెండింగ్ పనులు పూర్తిచేసి సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేయాలని మంత్రి ఆదేశించారు. మండలంలో పెండింగ్ ఉన్న 2 అంగన్వాడి భవనాలు, లింక్ రోడ్లు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ పంచాయతీ రాజ్ వెంకట్ రెడ్డి, తహసిల్దార్ విల్సన్, ఎంపిడిఓ అశోక్, ఎం.పి.ఓ. శ్రీనివాస్ రెడ్డి, డీ.ఈ మహేష్, ఏఈ చిరంజీవి , వ్యవసాయ శాఖ ఏ.ఓ, ప్రజా ప్రతినిధులు, ఆర్.డబ్ల్యూ.ఎస్., ఆర్ అండ్ బి అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments