కాకతీయ వన విహార్ ను సందర్శించిన అల్టిట్యూడ్ విద్యార్థులు
ఎల్కతుర్తి, ఫిబ్రవరి 21: (తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని అల్టిట్యూడ్ హై స్కూల్ విద్యార్థులు కాకతీయ వనవిహార్‌ను విద్యా విహారంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు విద్యార్థులకు అటవుల ప్రాముఖ్యత, అటవీ సంపద ప్రయోజనాలు మరియు సంరక్షణ అవసరంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
సుమారు 89 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కాకతీయ వనవిహార్‌లో అనేక రకాల ఔషధ మొక్కలు,, విభిన్న జాతుల చెట్లు మరియు విశాలమైన లోటస్ పాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రకృతి మధ్యలో విద్యార్థులు సంచరిస్తూ వృక్షజాలం, పక్షిజాలం, జీవ వైవిధ్యం గురించి తెలుసుకున్నారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు వారికి ఆనందాన్ని కలిగించాయి.
సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అటవులు భూమికి ఊపిరితిత్తులవంటివని, అవి ఆక్సిజన్‌ను విడుదల చేసి కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించడం ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. అటవులు వర్షపాతం సమతుల్యతకు దోహదపడటమే కాకుండా భూక్షయాన్ని అరికట్టి నేల సారాన్ని కాపాడుతాయని తెలిపారు. అడవులు తగ్గిపోవడం వల్లే వన్యప్రాణులు నివాసాలను కోల్పోయి గ్రామాల వైపు వస్తున్నాయని, కనుమరుగవుతున్న జంతు జాతులను రక్షించడం మనందరి బాధ్యత అని చెప్పారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం ద్వారా అటవులను కాపాడాలని సూచించారు.
పాఠశాల కరస్పాండెంట్ పుస్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అటవుల వల్ల మనకు వర్షాలు, ఔషధ సంపద, కలప, పండ్లు, తేనె వంటి అనేక సహజ వనరులు లభిస్తాయని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరింతగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రకృతి పరిరక్షణపై చైతన్యం పొందారు. అటవుల ప్రాధాన్యం గాలి కాలుష్య నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణ, భూక్షయం నివారణ, వన్యప్రాణుల రక్షణ వంటి అంశాల్లో కీలకమని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్ నవీన్, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రెతిరుపతి, ఉపాధ్యాయులు మమత, స్వప్న, కావ్య, కవిత, అనుష తదితరులు పాల్గొన్నారు.


Comments