వికలాంగులను గౌరవించని వారే అసలైన వికలాంగులు
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):
వికలాంగులుగా జన్మించడం తప్పు కాదని, అలాంటి వారిని ప్రేమించలేని మరియు గౌరవించలేని వ్యక్తులే అసలైన వికలాంగులని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.శనివారం వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మంది దివ్యాంగులకు స్కూటీల పంపిణీ కార్యక్రమం పట్టణంలోని పాత మార్కెట్ యార్డ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ హాజరై లబ్ధిదారులకు స్కూటీలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైకల్యం విజయానికి అడ్డంకి కాదని స్పష్టం చేశారు.వైకల్యంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని జయిస్తున్న దివ్యాంగులు సమాజానికి స్పూర్తిదాయకులని అన్నారు.వారికి చేయూతనిస్తూ గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.దివ్యాంగులు వికలత్వ భావనతో ఉండకుండా ఆత్మస్థైర్యం, పట్టుదల, ప్రతిభతో ముందుకు సాగాలని సూచించారు.దివ్యాంగుల్లో అమోఘ శక్తి దాగి ఉంటుందని, ఆ శక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.వైకల్యం విజయానికి అడ్డంకి కాదు… ప్రతిభ, ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపిస్తాయి అని ఆయన అన్నారు.కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, దివ్యాంగుల శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments