గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలని డిమాండ్

గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలని డిమాండ్

ఎల్కతుర్తి, మార్చి 24( తెలంగాణ ముచ్చట్లు):

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న పథకాల దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జాతీయ కమిటీ సభ్యుడు, దళిత రత్న అవార్డు గ్రహీత సాతూరి వెంకన్న మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ, పథకాల దరఖాస్తుల సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే చేరిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది అర్హులైన అభ్యర్థులకు సరైన సమాచారం అందలేదని తెలిపారు. సమాచారం లోపం వల్ల అనేక మంది లబ్ధిదారులు అవకాశాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దరఖాస్తు గడువును మరికొద్ది రోజులు పొడిగిస్తే అర్హులైన వారందరికీ సమాన అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వాహనాల మంజూరు పథకానికి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో, దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి వాహనాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే, పథకాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అధికార యంత్రాంగం గ్రామస్థాయిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులకు సహాయం అందించాలని ఆయన సూచించారు. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసి, ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఇకపై ఇలాంటి పథకాల సమాచారాన్ని ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎవరూ అవకాశాన్ని కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి గడువు పొడిగింపుపై స్పష్టత ఇవ్వాలని సాతూరి వెంకన్న మాదిగ విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News