సీఎంను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
ఎంఎంసి భూమిపూజకు ఆహ్వానం… కీలక సమస్యల పరిష్కారానికి ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 24 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, వచ్చే వారం నిర్వహించనున్న మల్కాజిగిరి మున్సిపల్ కమిషనరేట్ (ఎంఎంసి) భూమిపూజ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, రామంతపూర్ ప్రాంతంలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు.చర్లపల్లి డివిజన్ పరిధిలో ఇందిరా గృహకాల్ప పథకం కింద నిర్మించిన కాలనీల్లో నీటి లీకేజీలు, డ్రైనేజ్ సమస్యలు, స్లాబ్ పగుళ్లు వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలకు తక్షణ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కాలనీల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.పటేల్ కుంట, రామంతపూర్ చిన్న చెరువుల అభివృద్ధి చేపట్టాలని కూడా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈ వినతులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉప్పల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇవ్వగా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


Comments